ఎర్రజెండాలు కట్టి హెచ్చరిక లేఖలు విడుదల చేసిన యువకులు
ఇద్దరి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు: ఎస్పీ శ్రీనివాసరావు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 25: సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ పెంచుకుని ఆదాయం పొందాలనే ఉద్దేశంతో మావోయిస్టుల పేరుతో లేఖలు విడుదల చేసి, తూప్రాన్ మున్సిపాలిటీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ వద్ద ఎర్రజెండాలు కట్టిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన బండ మధు (24), చింతకింది శ్రీధర్ (22) ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు.
ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, ఇతర కంటెంట్‌ను విడుదల చేసే అలవాటు ఉందని, సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో పాటు ఎక్కువ వ్యూస్ ద్వారా ఆదాయం పొందాలనే ఉద్దేశంతో మావోయిస్టుల పేరుతో లేఖలు విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం తూప్రాన్ పోలీస్ స్టేషన్ వద్ద, మున్సిపల్ కార్యాలయంలో ఎర్రజెండాలు కట్టినట్లు పేర్కొన్నారు.సీసీ కెమెరా ఫుటేజీతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
నిందితులకు గతంలో మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని వారు కేవలం ఫేమస్ కావడం కోసమే ఇలాంటి చర్యలు పాల్పడ్డారని ఆయన అన్నారు. , ‘ఏపీటీఎచ్ – అలెగ్జాండర్ తెలంగాణ పీపుల్స్ హిస్టరీ’ పేరుతో లేఖలను విడుదల చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు సంబంధించిన కేసులో పదిమందికి ఉరిశిక్ష శిక్షలు విధించిన అంశాలను ప్రస్తావిస్తూ కూడా లేఖలు విడుదల చేసినట్లు వివరించారు.యువకులు గతంలో మేడారంలో ముఖ్యమంత్రి కార్యక్రమం సందర్భంగా కూడా ఎర్రజెండాలు కట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.ఈ కేసు చేదించిన ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎస్‌ఐ గంగారాజు తదితరులు పాల్గొన్నారు.






























