పీడిత వర్గాలకే రాజ్యాధికారం రావాలి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతే లక్ష్యం

మహాసేన జాతీయ అధ్యక్షుడు అనిల్ కుమార్

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ నవంబర్ 04: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 98 సంవత్సరాలు గడిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం దక్కలేదని, ఆయా వర్గాలను కేవలం ఓటు హక్కుకే పరిమితం చేస్తూ అగ్రవర్ణాలే అధికారాన్ని చెలాయిస్తున్నాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహాసేన జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది అనిల్ కుమార్ అన్నారు.బుధవారం మెదక్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాలో సుమారు 86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, రాబోయే ఎన్నికల్లో తమ ఐక్యశక్తిని చాటుతామని ప్రకటించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ఆయుధంగా మలుచుకొని, బహుజన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఓటు ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

‘మా రాజ్యంలో మా వాటా’ అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, బహుజనుల ఐక్యతే రాజ్యాధికార సాధనకు మార్గమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు కళావతి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.

‘ఓట్లు మావే.. సీట్లు మావే’ అనే నినాదంతో బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మహాసేన నాయకులు సులేమాన్ రాజ్, సిమన్ శంకర్, నిరంజన్ స్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసేన జాతీయ కార్యదర్శి అనిల్ కుమార్ బర్తడే సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు

Related News

Latest News