హామీల అమలేది? ఉద్యోగులకు భరోసా ఏదీ?

జీతాల కోసం ఎదురుచూపులా.. ఉద్యోగ భద్రత ఎప్పుడు?

జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమ్మెకు హరీశ్‌ రావు సంఘీభావం

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 15: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు వైద్య సేవలందిస్తూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు ఆయన గురువారం సంఘీభావం తెలిపారు.

జీతాల కోసం నెలల తరబడి ఎదురుచూపులా?

జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందాల్సి ఉందని హరీశ్‌రావు అన్నారు. కానీ నెల మధ్యకు వచ్చినా వేతనాలు అందని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఒక్కోసారి రెండు, మూడు నెలల పాటు జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం తగదన్నారు.

ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు జాతీయ ఆరోగ్య మిషన్‌, ఆయుష్‌, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తున్నా హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు.సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్‌ తాగినంత సమయంలో ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు.

కరోనా సమయంలో విశేష సేవలు

జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని గుర్తుచేశారు. ఆయుష్‌ ఉద్యోగులు పల్లె దవాఖానల్లో ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థలో వీరి పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇంతటి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

జాతీయ ఆరోగ్య మిషన్‌, ఆయుష్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. అర్హతను బట్టి భవిష్య నిధి, ఉద్యోగుల బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలన్నారు. విధి నిర్వహణలో ఉద్యోగి మరణించినా, ప్రమాదానికి గురైనా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ జీతాలు వెంటనే విడుదల చేయాలి

జాతీయ ఆరోగ్య మిషన్‌, ఆయుష్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌ వేతనాలు, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

Spread the love

Related News

Latest News