హైదరాబాద్‌ నుంచి చైనాకు రూ.2,700 కోట్ల బెట్టింగ్ సొమ్ము!

ప్రతిపక్షం, నవంబర్ 13: బెట్టింగ్ యాప్‌ల ద్వారా సేకరించిన భారీ మొత్తంలో డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు తరలించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ అక్రమ లావాదేవీలకు హైదరాబాద్‌కు చెందిన మూడు సంస్థలు సహకరించినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. గత మూడేళ్లలో సుమారు రూ.2,700 కోట్లను ఈ విధంగా చైనాకు బదిలీ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.

హైదరాబాద్‌కు చెందిన మూడు సంస్థలపై అధికారులు సోదాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు కథనం పేర్కొంది. హైదరాబాద్‌లోని కల్యాణనగర్‌, మల్లాపూర్‌, మాదాపూర్‌ చిరునామాలతో సాఫ్ట్‌వేర్‌ వ్యాపారం నిర్వహిస్తున్న ఈ సంస్థలు బెట్టింగ్‌ యాప్‌ల కార్యకలాపాలకు అవసరమైన వేదికలుగా పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. చైనా కంపెనీలు అభివృద్ధి చేసిన బెట్టింగ్‌ యాప్‌లను స్థానికంగా వినియోగదారులకు చేరవేయడం, వాటి ద్వారా సేకరించిన డబ్బును సంబంధిత ఖాతాలకు మళ్లించడం వంటి కార్యకలాపాల్లో ఈ సంస్థలు కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

బెట్టింగ్‌ ఆడేందుకు వినియోగదారులు చెల్లించిన మొత్తాలు తొలుత ఈ మూడు సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోకి చేరేవని, అనంతరం ఆ సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు తరలించేందుకు సహకరించినట్లు సమాచారం. ఈ సేవలకు ప్రతిఫలంగా సంస్థలు సుమారు 10 శాతం కమీషన్‌ తీసుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు కథనంలో పేర్కొన్నారు. మూడేళ్లలో మొత్తం రూ.2,700 కోట్ల లావాదేవీలు జరిగి ఉంటే, అందులో సుమారు రూ.270 కోట్లను ఈ మూడు సంస్థలు కమీషన్‌ రూపంలో పొందినట్లు ప్రాథమిక అంచనా.

ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో భారీ మొత్తంలో గెలిచిన వినియోగదారులకు చెల్లింపులు చేయకుండా, వారి ఖాతాలు, వ్యక్తిగత వివరాలను బ్లాక్‌ చేసి సంబంధాలు తెంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ యాప్‌ల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక నియంత్రణ చైనా నుంచే జరుగుతున్నట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం కేవలం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో సాగిన ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బెట్టింగ్‌ యాప్‌లలో ఎక్కువగా యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో, ఆ సొమ్మును నేరుగా క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు పంపడం కష్టమైన ప్రక్రియగా అధికారులు భావిస్తున్నారు. ప్రధాన బ్యాంకులు ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలకు సహకరించే అవకాశం తక్కువగా ఉండటంతో, గుజరాత్‌లోని కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల ద్వారా ఈ డబ్బును తరలించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. మొదట హైదరాబాద్‌ నుంచి సేకరించిన మొత్తాన్ని గుజరాత్‌లోని ఎంపిక చేసిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, అక్కడి నుంచి క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు పంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రక్రియలో గుజరాత్‌కు చెందిన పలువురు బ్యాంకింగ్‌ సంస్థలు, మధ్యవర్తుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ లావాదేవీలకు సహకరించిన బ్యాంకులకు కూడా భారీ మొత్తంలో కమీషన్లు చెల్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏయే బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం బదిలీ అయింది? వాటికి ఎంత కమీషన్‌ అందింది? ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది లేదా ఇతర మధ్యవర్తుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాల సమయంలో సేకరించిన వివరాలను దిల్లీలోని ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. ఈ కేసులో అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు, క్రిప్టో మార్పిడి, పలు రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉండటంతో జాతీయ స్థాయిలో విచారణ కొనసాగుతోంది.

ప్రస్తుతం ఈ మూడు హైదరాబాద్‌ సంస్థల కార్యకలాపాలు, వాటి బ్యాంకు లావాదేవీలు, చైనాకు డబ్బు తరలింపునకు ఉపయోగించిన మార్గాలపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. గుజరాత్‌లోని బ్యాంకుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత సంస్థలు, వ్యక్తులు, బ్యాంకులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందన్నది పూర్తి దర్యాప్తు అనంతరమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Latest News