ప్రతిపక్షం, నవంబర్ 09: దేశంలో సాయుధ నక్సలిజం ప్రభావాన్ని అడవుల నుంచి దాదాపుగా తుడిచిపెట్టేశామని, అయితే సమాజంలో మరో రూపంలో కొనసాగుతున్న ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా ‘దిమాగీ నక్సల్స్’ (మేధోపరమైన నక్సల్స్) పేరుతో కొందరు ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను వ్యతిరేకిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి శక్తులు సమాజంలోని వివిధ రంగాల్లో చొరబడి తమ భావజాలాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నక్సల్స్‌ను అడవుల నుంచి తరిమికొట్టడంలో భద్రతా బలగాలు గణనీయమైన పురోగతి సాధించాయని పేర్కొన్నారు. అయితే సాయుధ నక్సలిజం తగ్గినంత మాత్రాన సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు భావించకూడదని అన్నారు. ‘దిమాగీ నక్సల్స్ మన మధ్యే దాక్కున్నారు. వివిధ సంస్థలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. అనేక రాజకీయ పార్టీలు, సంస్థల్లోకి చొరబడ్డారు’ అని మోదీ ఆరోపించారు. ఇలాంటి శక్తులను గుర్తించి, వారి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దేశ భద్రత, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. నక్సలిజం కారణంగా గతంలో అనేక ప్రాంతాలు అభివృద్ధికి దూరమయ్యాయని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఆయా ప్రాంతాల్లో శాంతి, భద్రత నెలకొంటేనే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతాయని అభిప్రాయపడ్డారు. నక్సలిజం సమస్యను ఎదుర్కోవడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. బస్తర్ వేదికగా ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా చర్చకు దారితీశాయి.



























