దసరా పండుగకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం. హుస్నాబాద్. అక్టోబర్ 17: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

పండుగల నేపథ్యంలో ఆర్టీసీ చేపట్టిన ప్రత్యేక బస్సుల నిర్వహణ, ప్రయాణికుల రద్దీ నియంత్రణ, ఇతర ఏర్పాట్లపై మంత్రి ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, రీజినల్ మేనేజర్లు (ఆర్‌ఎంలు), ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ మూడు రోజులు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, రద్దీకి అనుగుణంగా అవసరమైన బస్సులను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. ఏయే మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందో ఎప్పటికప్పుడు గుర్తించి, ఆయా రూట్లలో అదనపు బస్సులను నడిపేలా ఆపరేషన్స్ నిర్వహించాలని ఆదేశించారు.

దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బస్సుల నిర్వహణ చేపట్టామని, ఇప్పటివరకు బస్సుల నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్‌స్టేషన్లలో ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రయాణికులకు బస్సుల లభ్యత, రాకపోకల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

బస్‌స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి వసతులు, పారిశుధ్యం, భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రయాణికుల అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించాలని, రద్దీ నియంత్రణలో సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

దసరా పండుగ ముగిసిన అనంతరం ప్రయాణికులు ఒకేసారి తిరుగు ప్రయాణం చేసే అవకాశం ఉన్నందున, ఆ రద్దీని ముందుగానే అంచనా వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండే పరిస్థితులు రాకుండా అవసరమైన రూట్లలో అదనపు బస్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆర్టీసీ ఎండీ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరూ అప్రమత్తంగా ఉండి, ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని మంత్రి స్పష్టం చేశారు.

పండుగల సందర్భంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకునేందుకు సొంత ఊళ్లకు వెళ్తున్న నేపథ్యంలో, వారి ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆర్టీసీ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

Spread the love

Related News

Latest News