చదువుతో ఆటల్లోనూ రాణించాలి!
విద్యార్థుల క్రీడాభివృద్ధికి దాతృత్వ హస్తం
నర్మెట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.10 వేల క్రీడా సామగ్రి అందజేత
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపిన జిన్న సతీశ్ రెడ్డి
ప్రతిపక్షం,నంగునూరు, నవంబరు 9: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం అందించాలంటే పెద్ద మనసు ఉండాలి. ఆర్థిక స్థోమత కంటే సేవా భావమే ముఖ్యమని నిరూపించారు అప్పలాయ చెరువు గ్రామానికి చెందిన జిన్నా సతీశ్ రెడ్డి. నర్మెట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలనే సదుద్దేశంతో రూ.10 వేల విలువైన క్రీడా సామగ్రిని అందించి తన ఉదారతను చాటుకున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎనగందుల మనీష్ కుమార్ పేర్కొన్నారు. క్రీడలు పిల్లల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాక క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పని చేసే తత్వాన్ని అలవర్చుతాయని తెలిపారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి సతీశ్ రెడ్డి స్వచ్ఛందంగా క్రీడా సామగ్రిని అందించడం అభినందనీయమని అన్నారు.
కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, విద్యార్థుల అభిరుచులు, ఆశయాలకు అండగా నిలవడం గొప్ప విషయమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఇలాంటి దాతల ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు జిన్నా సతీశ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ శనివారం స్వాతి బాబు క్రీడా సామగ్రిని అందించిన సతీశ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తులు, దాతలు తమవంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గడీల లలిత, హర్షద్, గ్రామస్తులు పాల్గొన్నారు.



























