[t4b-ticker]

బ్రేకింగ్‌: కొండా సురేఖకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. రాజీనామా చేయాలని స్పష్టీకరణ!

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖను పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే.. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాజ్‌భవన్‌కు బర్తరఫ్‌ లేఖ పంపించే అవకాశం ఉందని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకునేలోపే కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. బర్తరఫ్‌ వేటు పడే పరిస్థితి కంటే ముందుగానే స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే మంచిదని సురేఖ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్రంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని సురేఖకు సూచించినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకపోతే బర్తరఫ్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఆ స్థాయికి పరిస్థితిని తీసుకురావొద్దని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తనపై తీసుకోబోయే నిర్ణయాన్ని పునరాలోచించాలని కొండా సురేఖ కోరినప్పటికీ.. అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయడం దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం తనకు అవమానకరంగా ఉంటుందని సురేఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామా చేసే అంశాన్ని ఆమె పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆమె నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొత్తంగా కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఆమె మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తారా? లేక పార్టీ సభ్యత్వానికి కూడా గుడ్‌బై చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News