ప్రతిపక్షం, నవంబర్ 14: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన కలకలం రేపుతోంది. సంగయ్యపల్లికి చెందిన నందిని (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్న వయసులోనే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని ఆటలో ప్రతిభ కనబరుస్తున్న నందిని మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆమె బీసీసీఐ అండర్-19 జట్టుకు ఎంపికైనట్లు సమాచారం. చదువుతో పాటు క్రికెట్లోనూ రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న యువతి అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
నందిని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. చదువుతో పాటు క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంటూ ఆటలో మరింత మెరుగుపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఇద్దరు యువకులు కొంతకాలంగా వేధిస్తున్న కారణంగానే నందిని ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.
నందిని మృతికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వారు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. నందినికి న్యాయం చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యువ క్రికెటర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి, ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.





























