[t4b-ticker]

పల్లె పల్లెకు పొన్నం అన్న..


నేటి నుంచి నియోజకవర్గంలో ప్రజా పాలన

సైదాపూర్ మండలంలో తొలిరోజు పర్యటన.

ప్రజలు, రైతులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖాముఖి

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 19: హుస్నాబాద్ నియోజకవర్గంలో నేటి నుంచి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెల్లో ప్రజా పాలన” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అధికారుల సమన్వయంతో వాటికి పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.కార్యక్రమంలో భాగంగా తొలిరోజు సైదాపూర్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ప్రజలు, రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా తెలుసుకోనున్నారు.

  • సైదాపూర్ మండలంలో పర్యటన షెడ్యూల్

ఉదయం 9:00 గంటలకు దుద్దెనపల్లి గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
ఉదయం 11:00 గంటలకు ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రజలు, రైతులతో సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం 2:00 గంటలకు సోమారం గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది.
సాయంత్రం 4:00 గంటలకు వెన్నంపల్లి గ్రామంలో ప్రజలు, రైతులతో మంత్రి సమావేశం కానున్నారు.
సాయంత్రం 6:00 గంటలకు ఆరెపల్లి గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

గ్రామాల్లోనే సమస్యలకు పరిష్కారం

“పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెల్లో ప్రజా పాలన” కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, సాధ్యమైన వాటికి తక్షణ పరిష్కారం చూపడంతో పాటు మిగిలిన సమస్యలకు గడువుతో కూడిన కార్యాచరణ రూపొందించనున్నారు.తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, చెరువులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న, ప్రతిపాదిత అభివృద్ధి పనుల స్థితిగతులను తెలుసుకుని వాటిని వేగవంతం చేయనున్నారు.

  • ప్రతి గ్రామానికి 5 ప్రధాన అభివృద్ధి ప్రాధాన్యతలు

ప్రతి గ్రామంలో అత్యంత ముఖ్యమైన ఐదు ప్రధాన సమస్యలను గుర్తించి, వాటికి సంబంధిత శాఖ, అధికారి, నిధులు, చేపట్టాల్సిన చర్యలు, పూర్తి చేయాల్సిన గడువును నిర్ణయించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. అర్హత ఉన్నప్పటికీ పథకాల ప్రయోజనం పొందని వారిని గుర్తించనున్నారు.

  • గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, పింఛన్లు, రైతు సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు (SHGలు) తదితర అంశాలపై గ్రామాల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు.
గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమస్యలకు పరిష్కారం చూపడం ఈ కార్యక్రమంలో మరో కీలక అంశంగా ఉంది.

  • 24 గంటల్లో నివేదిక.. 7, 15, 30 రోజుల్లో సమీక్ష

కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. సమస్యలపై 24 గంటల్లో నివేదిక రూపొందించడంతో పాటు, వాటి పరిష్కారానికి అనుగుణంగా 7, 15, 30 రోజుల వ్యవధిలో సమీక్షలు నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించారు.ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, గ్రామాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే “పల్లె పల్లెకు పొన్నం అన్న” కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.

Spread the love

Related News

Latest News