మునుగోడులో కంటి వెలుగులు – 16 శిబిరాల్లో 2673 మందికి ఉచిత ఆపరేషన్లు.
16 ఉచిత కంటి వైద్య శిబిరాలు – 12,306 మందికి పరీక్షలు, 2,673 మందికి ఆపరేషన్లు, 5,522 మందికి కళ్లజోళ్లు
రేపు నారాయణ్ పూర్ లో 17వ ఉచిత కంటి వైద్య శిబిరం.
ప్రతిపక్షం, మునుగోడు సెప్టెంబర్ 26: మునుగోడు నియోజకవర్గంలో కంటి విప్లవం కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా కంటి సమస్యలతో బాధపడొద్దని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన చూపును అందించాలనే మానవతా దృక్పథంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు.ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాల ద్వారా ఇప్పటివరకు 16 విడతలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి రికార్డు సృష్టించారు. ఈ శిబిరాల ద్వారా 12,306 మందికి కంటి పరీక్షలు చేయించి, 2,673 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు పూర్తి చేసి, 5,522 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు.మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి పెద్ద కొడుకుగా మారి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తూ నిరుపేద వృద్ధుల కళ్లలో వెలుగులు నింపుతున్నారు.
*మండలాల వారీగా ఆపరేషన్ల వివరాలు:
- మునుగోడు మండలం – 1వ విడతలో 216 మందికి, 2వ విడతలో 108 మందికి
- చండూరు మున్సిపాలిటీ – 3వ విడతలో 129 మందికి
- నాంపల్లి మండలం – 4వ విడతలో 229 మందికి
- మర్రిగూడ మండలం – 5వ విడతలో 171 మందికి, 14వ విడతలో 127 మందికి
- చండూరు మండలం (బంగారిగడ్డ) – 6వ విడతలో 198 మందికి
- ఘట్టుప్పల్ మండలం – 7వ విడతలో 65 మందికి
- నారాయణ్ పూర్ మండలం – 8వ విడతలో 132 మందికి
- చౌటుప్పల్ మున్సిపాలిటీ – 9వ విడతలో 82 మందికి
- చౌటుప్పల్ మండలం – 10వ విడతలో 160 మందికి, 15వ విడతలో 165 మందికి
- మునుగోడు, ఘట్టుప్పల్ మండలాలు కలిపి – 11వ విడతలో 257 మందికి
- చండూరు మండలం & మున్సిపాలిటీ – 12వ విడతలో 223 మందికి (క్యాంపు కార్యాలయంలో)
- నాంపల్లి మండలం – 13వ విడతలో 228 మందికి
- మునుగోడు – 16వ విడతలో 183 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు.
రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా 10 వేల మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.అందులో భాగంగానే రేపు 27-09-2026 ఆదివారం నాడు నారాయణ్ పూర్ మండల కేంద్రంలో 17వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. కంటి సమస్య ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




























