త్వరలో మెదక్‌లో మరో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్

ప్రతిపక్షం ప్రతినిధిnమెదక్, సెప్టెంబర్ 24: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మెదక్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం తొలుత కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. దీనికి విశేష స్పందన రావడంతో మధిర, మంథని, మంచిర్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోనూ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడంలో భాగంగా మెదక్‌లోనూ కిచెన్‌ను సిద్ధం చేశారు.

మెదక్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని సుమారు 11 మండలాల పరిధిలో 395 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు.విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో మెనూను రూపొందించారు. ఇందులో ఇడ్లీ–సాంబార్, పూరీ–ఆలూ కుర్మా, దోశ–చట్నీ, ఉప్మా–చట్నీ, మిల్లెట్ ఇడ్లీ–సాంబార్, బోండా–చట్నీ వంటి అల్పాహార పదార్థాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక్కో రకం అల్పాహారాన్ని అందించనున్నారు. అదేవిధంగా విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలు కూడా అందిస్తారు.ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడేలా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రాకుండా, ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా చదువుపై దృష్టి సారించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News