[t4b-ticker]

కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎం ఆదేశం.. గవర్నర్‌కు లేఖ

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్‌కు లేఖ పంపినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు లోక్‌భవన్‌కు సమాచారం అందినట్లు సమాచారం.

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఆమె మంత్రి పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌ ఆమోదం అనంతరం బర్తరఫ్‌ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవుల్లో మార్పులు చేపట్టింది. రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మాజీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిని నియమించినట్లు సమాచారం. ఆమెకు క్యాబినెట్‌ హోదా కల్పించే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అదేవిధంగా తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించినట్లు సమాచారం. ఒకే సమయంలో మంత్రి పదవి, ప్రణాళికా బోర్డు, మహిళా కమిషన్‌ వంటి కీలక స్థానాల్లో మార్పులు చోటుచేసుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కొండా సురేఖను బర్తరఫ్‌ చేయాలని ప్రభుత్వం పంపిన లేఖపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.

Spread the love

Related News

Latest News