ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 08 : రంగారెడ్డి జిల్లా నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) గా డాక్టర్ కె. కళ్యాణ్ చక్రవర్తి బాధ్యతలు స్వీకరించారు.రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం జిల్లా క్షయ నివారణాధికారిగా (DTCO) సేవలందిస్తున్న డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి, డీఎంహెచ్ఓగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC – Full Additional Charge) అప్పగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల ఏసీబీ (ACB) దాడి నేపథ్యంలో నాటి డీఎంహెచ్ఓ డాక్టర్ డి. స్వర్ణకుమారిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, పరిపాలన సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం తక్షణమే ఈ కొత్త నియామక ఆదేశాలు ఇచ్చింది.ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె. కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) వైద్యులు, సిబ్బంది అందరూ నిబద్ధతతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.





























