తెలంగాణలో చలి పంజా.. ఈ సీజన్‌లో తొలిసారి సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!

ప్రతిపక్షం, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు మరింత దిగువకు చేరుకున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. సత్వార్‌లో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, కోహిర్‌లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. కామారెడ్డి జిల్లాలోని డోంగ్లీ ప్రాంతంలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో 10.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజాపూర్‌లో 12 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.

ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున పనులకు వెళ్లేవారు, రైతులు, కూలీలు, వాహనదారులపై చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు, చల్లటి గాలుల కారణంగా ఉదయం వేళ వాతావరణం మరింత చల్లగా మారుతోంది. గతంలో కంటే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించడం మంచిది. మొత్తంగా తెలంగాణలో చలికాలం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయా? చలి తీవ్రత ఏ స్థాయికి చేరుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతల నమోదుతో రాష్ట్రవ్యాప్తంగా చలిపై చర్చ మొదలైంది.

Related News

Latest News