ప్రతిపక్షం, ఆగస్టు 22: చిన్నపిల్లల ఆరోగ్యానికి వినియోగించే కొన్ని మందుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలోపు చిన్నారులకు క్లోర్‌ఫెనిరమైన్ మేలేట్, ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన స్థిర మోతాదు ఔషధ సమ్మేళనాలతో తయారైన మందులను వినియోగించకూడదని స్పష్టం చేసింది. చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పరిమితులు విధించినట్లు తెలుస్తోంది.
ఈ రెండు ఔషధ పదార్థాలను కలిపి తయారు చేసే స్థిర మోతాదు మందుల తయారీ, విక్రయాలపై కూడా ఆంక్షలు విధించినట్లు సమాచారం. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సమస్యలకు పిల్లలకు ఇచ్చే కొన్ని మందుల్లో ఈ ఔషధ సమ్మేళనాలు ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
క్లోర్‌ఫెనిరమైన్ మేలేట్ సాధారణంగా అలర్జీ లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగించే యాంటీహిస్టమైన్ కాగా, ఫినైలెఫ్రిన్ ముక్కు దిబ్బడను తగ్గించేందుకు ఉపయోగించే ఔషధ పదార్థంగా ఉంటుంది. అయితే చిన్న వయసు పిల్లల్లో వీటిని కలిపి ఉపయోగించే మందుల విషయంలో జాగ్రత్త అవసరమని కేంద్రం పేర్కొంది.
ఈ కాంబినేషన్‌తో తయారవుతున్న మందుల జాబితాలో మ్యాక్స్‌ట్రా, టీ-మినిక్, బారోహిస్ట్-ఏసీ, అలెక్స్+డీపీఎస్ వంటి పేర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇలాంటి మందులను ఇంట్లో పిల్లలకు సొంతంగా ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
చిన్నారులకు జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపించినప్పుడు వయసును బట్టి సరైన మందు మాత్రమే ఇవ్వాలి. ముఖ్యంగా నాలుగేళ్లలోపు పిల్లలకు వైద్యుల సలహా లేకుండా దగ్గు, జలుబు మందులు ఇవ్వకపోవడం మంచిది. ఇప్పటికే ఇంట్లో ఉన్న మందులపై కూడా వాటి కూర్పును పరిశీలించి, అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.




























