నేడు కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక

మహా పాదయాత్రకు భారీ ఏర్పాట్లు.. తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో కాషాయమయం

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, నవంబర్ 23: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు కరీంనగర్‌కు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు లక్ష మందితో నిర్వహించనున్న మహా పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ కాషాయ తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో కళకళలాడుతున్నాయి.మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకోనున్న నితిన్ నబీన్, గాంధీ బొమ్మ వద్ద ప్రారంభమయ్యే మహా పాదయాత్రలో పాల్గొంటారు. అనంతరం వైశ్యాభవన్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించి, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గడియారం సెంటర్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు పాదయాత్ర సాగనుంది.తెలంగాణ కళాకారుల ఆటపాటలు, డప్పు నృత్యాలతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. పాల్గొనే ప్రజలకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం అందుబాటులో ఉంచుతున్నారు. నితిన్ నబీన్ తొలిసారి కరీంనగర్‌కు వస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ మహా పాదయాత్రను చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Related News

Latest News