- రాజకీయ ప్రస్థానంపై పుస్తకం రాస్తా
- మారుతి నుంచి బోఫోర్స్ వరకు ప్రతి అంశంపైనా ఆరా
- నేషనల్ హెరాల్డ్.. పీవీతో విభేదాలపైనా ప్రశ్నలు
- బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సంచలన ప్రకటన
ప్రతిపక్షం నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ, నవంబర్ 22: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ ప్రస్థానాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఆమె రాజకీయ జీవితంలోని కీలక పరిణామాలు, వివాదాలు, ఆరోపణలతో పుస్తకం రాయనున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత విమర్శలకు పరిమితం కాకుండా.. మారుతి సంస్థ, నేషనల్ హెరాల్డ్, బోఫోర్స్ వివాదం సహా పలు అంశాలను ఆధారాలతో ప్రస్తావిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో సోనియా గాంధీకి సంబంధించి పది ప్రశ్నలను సంధిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘వేచి చూడండి’ అంటూ తన ప్రకటనకు ముగింపు పలికారు.
పది ప్రశ్నలతో రాజకీయ ప్రకంపనలు
సోనియా గాంధీ రాజకీయ ప్రస్థానంలో వివాదాస్పదంగా మారిన పలు అంశాలను దూబే తన ప్రశ్నల ద్వారా తెరపైకి తెచ్చారు. మారుతి సంస్థ యాజమాన్యం నుంచి నేషనల్ హెరాల్డ్ వ్యవహారం వరకు ప్రశ్నలు సంధించారు. 2004-2014 మధ్య ప్రధానమంత్రి కంటే సోనియాకే అధిక అధికారాలు ఉన్నాయన్న ఆరోపణలపైనా వివరణ కోరారు. బోఫోర్స్ వివాదం, మేనకా గాంధీతో విభేదాలు, చైనా ఒలింపిక్స్ పర్యటన వంటి అంశాలను ప్రస్తావించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో విభేదాలు, కాంగ్రెస్ సీనియర్ నేత సీతారాం కేసరికి సంబంధించిన వివాదం, 1999లో పార్టీలో సోనియాకు వ్యతిరేకంగా నిలిచిన నేత ఎవరు? అనే ప్రశ్నలను కూడా లేవనెత్తారు. చివరగా రాహుల్, ప్రియాంకల్లో ఎవరికి ఆమె రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారంటూ ప్రశ్నించారు.
మారుతి సంస్థపై ప్రత్యేక గురి
సోనియా గాంధీకి మారుతి సంస్థతో ఉన్న సంబంధాలపై నిశికాంత్ దూబే మరోసారి ఆరోపణలు చేశారు. సంస్థ యాజమాన్యం, వాటాదారుల వివరాలు, డైరెక్టర్ పదవి వంటి అంశాలపై ప్రశ్నలు సంధించారు. సంజయ్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 1970 నవంబర్ 21న ఒప్పందం కుదిరిందని తన పోస్టులో పేర్కొన్నారు. 1970లో సంస్థ ఏర్పాటైనప్పటికీ, 1968లోనే కార్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ ప్రశ్నించారు. సోనియా గాంధీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా, 50 శాతం వాటాదారుగా ఉన్నారన్న ఆరోపణలు చేస్తూ.. అప్పటి నిబంధనల ప్రకారం విదేశీ పౌరులకు ఇలాంటి పదవులు చేపట్టే అవకాశం ఉందా? అని నిలదీశారు.
జ్ఞాపకాల పుస్తకంతోనూ వివాదం
ఇటీవల సోనియా గాంధీ తన జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ను విడుదల చేశారు. ఈ పుస్తకంలోని అంశాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిశికాంత్ దూబే ఆమె రాజకీయ జీవితంపై ప్రత్యేక పుస్తకం రాయనున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయన ప్రస్తావించిన అంశాలు, ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు పుస్తకంలో ఎలా పొందుపరుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
- సోనియాపై దూబే సంధించిన పది ప్రశ్నలు
- మారుతి సంస్థకు సోనియా గాంధీ యజమానిగా ఎలా మారారు?
- నేషనల్ హెరాల్డ్ సంస్థను కొనుగోలు చేసిన విధానం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి?
- 2004 నుంచి 2014 మధ్య ప్రధానమంత్రి కంటే సోనియాకే ఎక్కువ అధికారాలు ఉన్నాయన్న ఆరోపణల్లో వాస్తవమెంత?
- బోఫోర్స్ వివాదం వెనుక అసలు కథ ఏమిటి?
- మేనకా గాంధీ, సోనియా గాంధీ మధ్య విభేదాలకు కారణాలేమిటి?
- అప్పటి ప్రధానమంత్రి వెళ్లకుండా సోనియా తన కుటుంబంతో కలిసి చైనా ఒలింపిక్స్‌కు ఎందుకు వెళ్లారు?
- సీతారాం కేసరి ధోతీకి సంబంధించిన వివాదం వెనుక కథ ఏమిటి?
- మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సోనియా గాంధీ మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి?
- 1999లో కాంగ్రెస్‌లో సోనియాకు వ్యతిరేకంగా వ్యవహరించిన నేత ఎవరు?
- రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల్లో రాజకీయంగా సోనియా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు?





























