ప్రతిపక్షం, నవంబర్ 21: సొంతంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే పనులు నిలిపివేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూఫ్ రీప్లేస్మెంట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ముఖ్యంగా ఎల్-3 కేటగిరీలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇంటికి స్లాబ్ వేయడం, ప్లాస్టరింగ్ తదితర పనులు పూర్తి చేసుకునేందుకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి బిల్లులు అందక, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆపేసిన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు ఇప్పటికే అర్హులైన వారి నుంచి దరఖాస్తుల సేకరణ చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణకు తొలుత నిర్ణయించిన గడువు ముగిసినప్పటికీ, ఇంకా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఎల్-3 కేటగిరీలో ఉన్నవారు, నిర్మాణ పనులు ప్రారంభించి ఆర్థిక కారణాలతో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు పురోగతి వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 12,629 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. వీరిలో 9,102 ఇళ్లకు మార్క్ అవుట్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు 3,091 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు కూడా చేశారు. మరో 4,037 ఇళ్లు ప్రస్తుతం రూఫ్ దశలో ఉండగా, 396 ఇళ్లు గోడల నిర్మాణ దశలో, 700 ఇళ్లు బేస్మెంట్ దశలో ఉన్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలోనే మరిన్ని గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న పాత ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రూఫ్ పునఃప్రారంభ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 24,298 మంది లబ్ధిదారుల ఇళ్లను గెజిటెడ్ స్థాయి అధికారులు సర్వే చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుంచి 2013 మధ్య పాత ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన సుమారు 4.52 లక్షల ఇళ్లు వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఆర్థిక సమస్యలు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, ప్రభుత్వ బిల్లులు అందకపోవడం వంటి కారణాలతో చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు.
అదేవిధంగా 2023లో గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 9,741 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనప్పటికీ, పథకం నిలిచిపోవడంతో అనేక ఇళ్లు అసంపూర్తిగా మిగిలాయి. కొన్ని ఇళ్లు పునాది దశలోనే ఉండగా, మరికొన్ని గోడల నిర్మాణం వరకు పూర్తయ్యాయి. ఇంకొన్ని ఇళ్లకు తాత్కాలికంగా రేకులు, రాతి పలకలతో పైకప్పులు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ఇళ్లను పూర్తిస్థాయి గృహాలుగా మార్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల రెండో దశలో భాగంగా సాయం అందించాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 48,590 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని మినహాయించి ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున కేటాయింపులు చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు మొత్తం రూ.1,400 కోట్ల నిధులను కేటాయించింది. అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకానికి అర్హులైన వారు ఈ నెలాఖరులోగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ వార్డు అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.


























