[t4b-ticker]

ఇంజినీర్లపై సీఎం వ్యాఖ్యలు.. రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్

ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టాలు పొందుతున్నప్పటికీ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో చాలామంది ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని అన్నారు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసే స్థాయిలో కూడా కొందరు విద్యార్థులకు ప్రాథమిక నైపుణ్యాలు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్న ఆయన, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం డిగ్రీలు కాకుండా ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.

అయితే సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్, ఇంజినీరింగ్ విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. సీఎం స్వయంగా ఎప్పుడైనా పోటీ పరీక్ష రాశారా? ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరయ్యారా? అంటూ ప్రశ్నించారు.

అంతేకాకుండా, రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ “రియల్ ఎస్టేట్ బ్రోకర్” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభను కించపరచడం బాధ్యతాయుతమైన నాయకుడికి తగదని, యువతను ప్రోత్సహించేలా ప్రభుత్వం వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు.

సీఎం వ్యాఖ్యలు, కేటీఆర్ ప్రతిస్పందనతో ఈ అంశం రాజకీయంగా వేడెక్కగా, విద్యా నాణ్యత, నైపుణ్యాభివృద్ధి, యువత ఉపాధి అవకాశాలపై మరోసారి చర్చ మొదలైంది.

Spread the love

Related News

Latest News