*దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
*కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు – విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.
*ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో సర్వీస్ రోడ్డుపైకి మళ్లింపు – ఇరుకు రోడ్డులో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
*నెమ్మదిగా కదులుతున్న వాహనాలు – రంగంలోకి దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు.
ప్రతి పక్షం చౌటుప్పల్ అక్టోబర్ 22: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దసరా పండుగ సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటుండటంతో చౌటుప్పల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం నుండి ఈ రద్దీ మొదలైంది. చౌటుప్పల్ పట్టణ పరిధిలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రధాన రహదారిని మూసివేసి, వాహనాలన్నింటినీ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు.అయితే విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఆ చిన్న సర్వీస్ రోడ్డు సరిపోక కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కార్లు, బస్సులు, లారీలు, ఇతర ప్రైవేట్ వాహనాలు నెమ్మదిగా పాకుతూ ముందుకు కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు. వాహనాలను వరుస క్రమంలో పంపిస్తూ రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పండుగ సీజన్ కావడంతో రానున్న రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.





























