ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మంచాల మండలం నోముల గ్రామంలో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న భార్యను కిరాతకంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త బాబు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
స్థానికుల సమాచారం ప్రకారం, గురువారం రాత్రి అతడు తన భార్య సమాధి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. భార్య హత్య అనంతరం గ్రామానికి దూరంగా ఉంటున్న బాబు, అకస్మాత్తుగా ఆమె సమాధి వద్ద మృతదేహంగా కనిపించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా ఆత్మహత్యేనా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా బాబు మృతికి గల అసలు కారణాలను పోలీసులు నిర్ధారించనున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

















