రాజగోపాల్ రెడ్డి చొరవతో మునుగోడులోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం.

*రాజగోపాల్ రెడ్డి చొరవతో మునుగోడులోని అన్ని మండలాలు ఎంపిక.

*రైతాంగానికి దక్కనున్న ప్రభుత్వ ఆసరా!

*ఎల్ నినో ప్రభావంతో ఎండిపోయిన పంటలు.

*క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎమ్మెల్యే అధికారులతో నిరంతర సమీక్షలు.

*ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సమగ్ర నివేదికలు పంపించిన ఘనత రాజగోపాల్ రెడ్డి దే.

*తాగునీరు, పశుగ్రాసం, ఉపాధి పనులపై ప్రత్యేక దృష్టి సారించనున్న యంత్రాంగం.

ప్రతి పక్షం మునుగోడు, అక్టోబర్ 27: మునుగోడు నియోజకవర్గంలోని రైతాంగ కష్టాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం జరిపిన పోరాటం, చూపిన చొరవ ఎట్టకేలకు ఫలించింది. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయి అల్లాడుతున్న మునుగోడు రైతాంగానికి ఈ ప్రకటనతో ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం, ఇన్పుట్ సబ్సిడీ, పశుగ్రాసం, ఉపాధి హామీ పనుల రూపంలో ఊరట లభించనుంది.

*అధికారులపై ఒత్తిడి.. ప్రభుత్వానికి నివేదికలు:

పూర్తిగా వర్షాధార పంటలపై ఆధారపడి జీవించే మునుగోడు నియోజకవర్గ రైతులు ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్‌తో తీవ్రంగా నష్టపోయారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతులు గుండెకోతకు గురయ్యారు. ఈ క్షేత్రస్థాయి విపత్కర పరిస్థితులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్లతో పాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు జరుపుతూ, వాస్తవ నష్టాన్ని అంచనా వేయించారు. పంట నష్టంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు వెళ్లేలా అధికారులపై ఇటు యంత్రాంగంపై నిరంతర ఒత్తిడి తెచ్చి, మునుగోడును కరువు ప్రాంతంగా గుర్తించడంలో ఆయన కీలక ప్రణాళికతో వ్యవహరించారు.

*వెనుకబడిన ప్రాంతానికి ప్రభుత్వ తోడ్పాటు:

భౌగోళికంగా వెనుకబడిన మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల రైతులకు పెట్టుబడి రాయితీ అందడంతో పాటు, బ్యాంక్ రుణాల రీషెడ్యూలింగ్ వంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ కరువు ప్రకటన నేపథ్యంలో నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటం, మూగజీవాలకు పశుగ్రాసం కొరత లేకుండా చేయడం, వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పనుల రోజులను పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.రైతుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిరంతర కృషితోనే మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కరువు సాయం అందే మార్గం సుగమమైందని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News