ప్రతిపక్షం, ఆగస్టు 02: తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలో నిర్వహించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రవాస భారతీయులకు వివరించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తూనే, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విస్తరణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ ప్లాన్ను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ ప్రణాళికలో పారిశ్రామికాభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వివరించారు.
తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం అనుకూల విధానాలను అమలు చేస్తోందని భట్టి చెప్పారు. ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక కారిడార్లు, ఆధునిక రవాణా వ్యవస్థలు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధితో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రవాస భారతీయులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన భట్టి, విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి అవకాశాలను తెలంగాణలో సృష్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో తెలంగాణ ప్రపంచ స్థాయి రాష్ట్రంగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

















