[t4b-ticker]

అభివృద్ధికి అలియాబాద్ కౌన్సిల్ పెద్దపీట

రూ.1.38 కోట్ల పనులకు ఆమోదం.. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులపై కీలక నిర్ణయాలు

ప్రతిపక్షం,శామీర్ పేట, సెప్టెంబర్ 16: అలియాబాద్ పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా అలియాబాద్ పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం బుధవారం జరిగింది.పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ కంటం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి వైస్ ఛైర్‌పర్సన్ మాలతి మాధవరెడ్డి, కమిషనర్ ఎన్.వెంకటరెడ్డి, కౌన్సిలర్లు,మున్సిపల్ అధికారులు హాజరయ్యారు.

పురపాలక సంఘ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగా రూ.1.38 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.పారిశుద్ధ్య నిర్వహణ, భూగర్భ మురుగునీటి కాలువల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, అంతర్గత రహదారుల మరమ్మతులు, వీధిదీపాల నిర్వహణ,పార్కులు, హరిత ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై కౌన్సిల్ చర్చించింది. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలనాపరమైన అనుమతులకు కూడా ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ కంటం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పురపాలక సంఘ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వైస్ ఛైర్‌పర్సన్ మాలతి మాధవరెడ్డి మాట్లాడుతూ,పరిశుభ్రమైన వాతావరణం,మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు పురపాలక సంఘం తరఫున అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.

సమావేశంలో కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాలపై చర్చించిన కౌన్సిల్ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పౌర సేవల మెరుగుదలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది.

రూ.1.38 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం, పారిశుద్ధ్యం–మౌలిక వసతులపై కీలక నిర్ణయాలతో అలియాబాద్ పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం ముగిసింది

Spread the love

Related News

Latest News