[t4b-ticker]

రెండు విడతల్లో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులందరికీ ఇల్లు అందిస్తాం: మంత్రి పొంగులేటి

ప్రతిపక్షం, భద్రాద్రి కొత్తగూడెం, జులై 30: రాష్ట్రంలోని ప్రతి అర్హ పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్య బంజర గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, లో-లెవల్ కాజ్‌వేను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలు తీరును వివరించారు.

మంత్రి మాట్లాడుతూ, మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పేదలకు మంజూరైనట్లు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలోనే లక్ష ఇళ్లను కేటాయించినట్లు చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా పూర్తిగా అర్హతనే ప్రామాణికంగా తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. మూడో, నాలుగో విడతల్లో కూడా మిగిలిన ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఇప్పటికే ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ గృహాలు వంటి హామీలను దశలవారీగా అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని, సంక్షేమం మరియు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. ప్రజల సహకారంతో ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News