నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఏర్పాటు
ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నిక
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 15: ఉద్యోగుల ఐక్యతే బలం.. పేద విద్యార్థుల విద్యాభివృద్ధే లక్ష్యం.. సామాజిక సేవతో గ్రామాభివృద్ధికి తోడ్పాటే ధ్యేయంగా నంగునూరు ఉద్యోగులు ముందడుగు వేశారు. గ్రామానికి చెందిన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఏకమై నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ, ప్రజా సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. గురువారం నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సహాయం అందించాలని నిర్ణయించారు. గ్రామంలో ఆరోగ్య అవగాహన, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు. అవసరమైన కుటుంబాలకు సహాయం చేయడం, రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. యువత నైపుణ్యాభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గం
సంస్థ అధ్యక్షుడిగా కోల కనకయ్య గౌడ్, ఉపాధ్యక్షుడిగా పిట్టల రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ దేవులపల్లి పరశురాములు, కోశాధికారిగా జిడిపల్లి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ముద్రబోయిన బాలమణి ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా అనుమాసు నరోత్తం రెడ్డి, కల్లూరి నర్సింలు, డి.రజిత ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా మంగు రాధాకిషన్ రావు, గౌరవ సలహాదారులుగా దాసరి రామలింగం, సూదిరెడ్డి మల్లారెడ్డిని ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో అదిరాల సాయినాథ్ శర్మ, వల్లపురెడ్డి భూపారెడ్డి, మెతుకు పరమేశ్వర్ రెడ్డి, కె.బాలమల్లు, వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి, కట్కూరి శ్రీనివాస రెడ్డి, సుద్దాల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.సంస్థ కార్యవర్గ పదవీ కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయించారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఐకమత్యంతో పనిచేస్తూ సంస్థ ఆశయాలను నెరవేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామాభివృద్ధి, పేద విద్యార్థుల భవిష్యత్తు, ప్రజా సంక్షేమానికి సంస్థను వేదికగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.





























