*ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
*ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 12 : నల్గొండ నియోజకవర్గ స్థాయి చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ నెల 13న (శుక్రవారం) నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్లో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గురువారం జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఏచూరి గార్డెన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నల్గొండ నియోజకవర్గ పరిధిలోని మండలాలు మరియు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం (శానిటేషన్), భోజన వసతి ఏర్పాట్లు చేయాలి.
లబ్ధిదారులకు సులభంగా పెన్షన్లు అందేలా మండలాలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల వారీగా ప్రత్యేక కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. ఎక్కడ పెన్షన్ పంపిణీ చేస్తారో స్పష్టంగా తెలిసేలా ఏర్పాట్లు ఉండాలి.
పెన్షన్ల పంపిణీ సమాచారాన్ని లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలి. ప్రాంగణంలో పబ్లిక్ అడ్రస్ సిస్టం (మైక్ ఏర్పాట్లు) సిద్ధం చేయాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు పెన్షన్లు పంపిణీ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. మండలాల వారీగా అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ముందుగానే సిద్ధం చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు.ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, ఆర్&బీ శాఖ మంత్రి పీఏ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.






























