ఫోన్ సిగ్నల్స్ లేక అవస్థలు.. శాశ్వత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్
మెదక్ ప్రతినిధి:
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ నవంబర్ 01: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో మెదక్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా, కొంగుబంగారంగా కొలిచే వనదుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం భక్తి సందడితో కిక్కిరిసింది. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆలయ ఈఓ వీరేశం తెలిపారు.
ఫోన్ సిగ్నల్స్ లేక భక్తుల ఇక్కట్లు
ఏడుపాయల ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా అందకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ బంధువులతో మాట్లాడలేక, ఒకరినొకరు కలుసుకోలేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ చెల్లింపులపై ఆధారపడిన దుకాణదారులు, కొనుగోలుదారులు లావాదేవీలు నిర్వహించలేక ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నపిల్లలు తప్పిపోయినా, అత్యవసర సమాచారం చేరవేయాలన్నా సిగ్నల్స్ లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, వారి సహకారంతో త్వరలో సెల్ఫోన్ టవర్లు లేదా ఇతర సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈఓ వీరేశం వెల్లడించారు.
శాశ్వత వాహన పార్కింగ్ ఏర్పాటు చేయాలి
ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి కార్లు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలతో పాటు వివిధ వాహనాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే సరైన శాశ్వత పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటమే కాకుండా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. పోలీసు, ఆలయ అధికారులు సమన్వయంతో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.































