[t4b-ticker]

స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే!

ప్రతిపక్షం, ఆగస్టు 15: భారతదేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ రెండు జాతీయ పండుగలు దేశ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనవి. అయితే చాలామందికి ఈ రెండు రోజులకు మధ్య ఉన్న అసలు తేడా పూర్తిగా తెలియకపోవచ్చు.

1947 ఆగస్టు 15న దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందింది. అందుకే ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజున దేశ ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు.

ఇక 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో భారత్ సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున దేశ రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఘనమైన గణతంత్ర వేడుకలు, సైనిక కవాతులు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.

ఆగస్టు 15కు, జనవరి 26కు మధ్య ప్రధాన తేడా ఇదే: ఆగస్టు 15 భారత్ విదేశీ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజుకు గుర్తు కాగా, జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశం గణతంత్రంగా మారిన రోజుకు గుర్తు.

అంతేకాదు.. భారత్‌తో పాటు బహ్రెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి కొన్ని దేశాలు కూడా ఆగస్టు 15న తమ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోవడం విశేషం. రెండు జాతీయ పండుగలు వేర్వేరు చారిత్రక సందర్భాలకు గుర్తులైనా.. దేశ ప్రజల్లో దేశభక్తి, ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో రెండింటికీ ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.

Spread the love

Related News

Latest News