ప్రతిపక్షం, ఆగస్టు 05: తెలంగాణలో ఆటో, క్యాబ్ సేవలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్ల సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు.
బంద్‌కు ముందు వచ్చే శనివారం రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌కు అధికారికంగా సమ్మె నోటీసు అందజేయనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే సమ్మెను తప్పనిసరిగా అమలు చేస్తామని హెచ్చరించింది.
ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ (ఈవీ) ఆటోలను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం జీవనోపాధిగా ఆటోలు నడుపుతున్న వేలాది మంది డ్రైవర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జేఏసీ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలకు ఒకే పర్మిట్ విధానం అమలు చేసి డ్రైవర్లకు ఇబ్బందులు తొలగించాలని కూడా డిమాండ్ చేసింది.
ప్రభుత్వం తమ సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాలని, లేకపోతే ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, యాప్ ఆధారిత క్యాబ్‌లు బంద్‌లో పాల్గొంటాయని జేఏసీ స్పష్టం చేసింది. దీంతో ప్రయాణికులపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

















