[t4b-ticker]

జీఎస్టీ ఆదాయం పెంచేందుకు ఏఐ వినియోగం.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 08: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచేందుకు కృత్రిమ మేధస్సు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలు చేపట్టడంతో పాటు పన్నుల లీకేజీలను అరికట్టి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడం, ఆదాయ వనరులను పెంచడం, పన్నుల వసూళ్లలో సాంకేతికతను సమర్థంగా ఉపయోగించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ప్రధానంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చ జరిగింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన సమాచారాన్ని కృత్రిమ మేధస్సు ఆధారంగా సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పన్ను చెల్లింపులు, వ్యాపార కార్యకలాపాలు, లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా పన్నుల ఎగవేతకు అవకాశాలను ముందుగానే గుర్తించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.

అయితే ప్రభుత్వ ఆదాయం పెంచే క్రమంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత పెంచడంతో పాటు సులభతర వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించాలని అన్నారు. సాంకేతికతను వ్యాపారాలపై అదనపు భారం మోపేందుకు కాకుండా, ప్రభుత్వ వ్యవస్థలను మరింత సులభతరం చేసేందుకు ఉపయోగించాలని సూచించారు.

నిర్మాణ రంగంలో పన్నుల లీకేజీలను అరికట్టడంపై కూడా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. భవన నిర్మాణాలు, నిర్మాణ సామగ్రి వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేయాలని సీఎం సూచించారు. మున్సిపల్ శాఖ, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల సమాచారాన్ని కృత్రిమ మేధస్సు ఆధారిత సమగ్ర వ్యవస్థతో అనుసంధానం చేయాలని చెప్పారు.

భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకునే సమయంలోనే నిర్మాణానికి అవసరమైన సామగ్రి వివరాలను నమోదు చేసే విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ నిర్మాణానికి అనుగుణంగా చెల్లించాల్సిన పన్నుల అంచనాలను కూడా ముందుగానే రూపొందించేందుకు ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. దీనివల్ల నిర్మాణ రంగంలో జరిగే లావాదేవీలను సమర్థంగా పర్యవేక్షించడంతో పాటు పన్నుల లీకేజీలను అరికట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వివిధ రకాల సమాచారాన్ని సమీకృతం చేయడం ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా మార్చుకోవచ్చని సీఎం అన్నారు. మీ సేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి తదితర పథకాలు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని అవసరమైన చోట సమగ్రంగా విశ్లేషించేందుకు వీలుగా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.

పన్నుల శాఖల మధ్య సమన్వయం పెంచడం, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు, వ్యాపారులకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాంకేతికత ఆధారిత పాలనలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News