[t4b-ticker]

మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం నెలాఖరులోగా పూర్తి: తుమ్మల నాగేశ్వరరావు

ప్రతిపక్షం, ఆగస్టు 15, భద్రాద్రి కొత్తగూడెం: మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేసి సాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి రాజకీయాలు జరిగినా పనులను పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని తెలిపారు.

అశ్వాపురం మండలం సీతారామ పంప్‌హౌస్‌ వద్ద రాజీవ్ లింక్ కెనాల్‌కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విడుదల చేశారు. మోటార్లను స్విచ్ ఆన్ చేసి కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి జలాలు సాగర్ ఆయకట్టు రైతులకు ఎంతో భరోసా ఇస్తాయని చెప్పారు.

రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీటిని సాగర్ ఆయకట్టుకు తరలిస్తున్నామని మంత్రి వివరించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు.

మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తుమ్మల తెలిపారు. పనులు పూర్తి చేసి సాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

పైప్‌లైన్ పనుల కోసం రైతుల భూముల్లో తవ్వకాలు చేపట్టిన ప్రాంతాలను తిరిగి పూడ్చి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పనులు పూర్తయిన తర్వాత యథావిధిగా తమ భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు.

పినపాక ప్రాంతానికి నీరు అందించాల్సిన పరిస్థితుల్లో ఖమ్మం వైపు నీటిని తరలించాల్సి రావడం బాధాకరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోదావరి జలాలను మరింత సమర్థంగా వినియోగించుకుని ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Spread the love

Related News

Latest News