*ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు – ఆత్మ చైర్మన్ సురేందర్ రెడ్డి.
*తిమ్మారెడ్డిగూడెంలో ATMA ఆధ్వర్యంలో RPL శిక్షణ కార్యక్రమం
*జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ .
ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 24: చండూరు మండలంలోని తిమ్మారెడ్డిగూడెం రైతు వేదికలో గురువారం వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA), మునుగోడు డివిజన్ ఆధ్వర్యంలో రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (RPL) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మునుగోడు డివిజన్ ATMA చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ వ్యవసాయ కార్యక్రమాలు, పంటల సాగులో పాటించాల్సిన మెళకువలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, గో ఆధారిత వ్యవసాయం చేయాలని, విచక్షణారహిత పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ పప్పు దినుసులు మరియు పత్తి పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు ప్రధానమని అన్నారు. పంటలను ఆశించే వివిధ రకాల చీడపీడలు, తెగుళ్లను ముందుగానే గుర్తించడం, వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ (IPM) పద్ధతులను అవలంబించడం, అవసరానికి అనుగుణంగా మాత్రమే పురుగుమందులు వినియోగించడం, పురుగుమందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడం గురించి రైతులకు వివరించారు.
ప్రకృతి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించే పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, పర్యావరణ హిత సాగు విధానాలను తెలియజేశారు.ఉద్యాన శాఖ అధికారులు ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులకు ఉన్న అవకాశాలు, అనుకూలమైన భూములు, సాగు విధానం, మొక్కల సంరక్షణ, నీటి యాజమాన్యం, దీర్ఘకాలికంగా ఆదాయం పొందే విధానాలపై వివరించారు. అలాగే వెటర్నరీ డాక్టర్ పశుపోషణ గురించి రైతులకు అవగాహన కల్పించారు.ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతి రైతు, వారి భూముల వివరాలను నమోదు చేసుకోవాల్సిన అవసరం, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, సేవలు సులభంగా పొందేందుకు దాని ప్రాధాన్యతపై కూడా వివరించారు.RPL కార్యక్రమం ద్వారా ఇప్పటికే వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతుల పూర్వ జ్ఞానం, నైపుణ్యాలను గుర్తించి, వాటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునుగోడు వ్యవసాయ సహాయ సంచాలకులు బి. వేణుగోపాల్, మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్, ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్, వెటర్నరీ డాక్టర్ రమేష్, ATMA డైరెక్టర్లు, ఏఈఓ నాగార్జున, నేర్మట గ్రామ సర్పంచ్, తిమ్మారెడ్డిగూడెం ఉప సర్పంచ్ గుణగోని సైదులు తదితర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.






























