నంగునూరు సీహెచ్సీని 50 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి వినతి
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 29: సిద్ధిపేట జిల్లా నంగునూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 30 పడకల నుంచి 50 పడకలకు పెంచాలని నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఆసుపత్రి స్థాయిని పెంచి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రికి వినతిపత్రం అందించారు.
గతంలోనే 50 పడకల ఆసుపత్రికి ఉత్తర్వులు
నంగునూరు మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గతంలోనే నంగునూరు సీహెచ్సీని 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు దేవులపల్లి యాదగిరి తన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంగునూరు సీహెచ్సీ సామర్థ్యాన్ని 50 పడకలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగా ఆసుపత్రి భవన నిర్మాణం కోసం రూ.8.76 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రకటనలకే పరిమితం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన మొదటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిరోజే ఈ ఆస్పత్రి స్థాయిని పెంచుతామని ఘనంగా ప్రకటించిందన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తన ప్రకటనను అమలు చేయక పోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని చెప్పారు. ఉత్తర్వుల ప్రకారం ఆస్పత్రి స్థాయిని పెంచక పోగా, మొదటి రోజు ఆర్భాటంగా చేసిన ప్రకటనను కూడా అమలు చేయక పోవడంతో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు.
భవన నిర్మాణం పూర్తయినా.. 30 పడకలకే పరిమితం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మజూరు చేసిన నిధులతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టి పూర్తి చేశారని తెలిపారు. ఆసుపత్రి మాత్రం ఇప్పటికీ 30 పడకల సామర్థ్యంతోనే కొనసాగుతోందని యాదగిరి పేర్కొన్నారు. ఆసుపత్రి భవన నిర్మాణం 50 పడకలకు అనుగుణంగా జరిగిందని చెప్పారు. అవసరమైన వైద్య సిబ్బంది, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
నంగునూరు మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వైద్య చికిత్సల కోసం ఈ ఆసుపత్రిపై ఆధార పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర వైద్యం, గర్భిణులకు ప్రసూతి సేవలు, చిన్నపిల్లల వైద్యం, ప్రమాదాల్లో గాయపడిన వారికి చికిత్స, ఇతర అనారోగ్య సమస్యల పరిష్కారానికి స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పడకల సంఖ్య పెరిగితే ఎక్కువ మంది రోగులకు ఒకేసారి వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని, మెరుగైన చికిత్స కోసం సిద్ధిపేటతో పాటు ఇతర పట్టణాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం కొంతవరకు తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల పేద, మధ్యతరగతి ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు సకాలంలో వైద్యం పొందేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు.
మంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
గతంలోనే 50 పడకల ఆసుపత్రిగా స్థాయిని పెంచేందుకు ఉత్తర్వులు జారీ కావడం, భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం, భవన నిర్మాణం పూర్తికావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని దేవులపల్లి యాదగిరి కోరారు. ఆసుపత్రిని 50 పడకల సామర్థ్యంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన పరిపాలనా అనుమతులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకొని నంగునూరు సీహెచ్సీని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ చర్యతో నంగునూరు మండల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.





























