నల్లగొండ జిల్లాలో యువజన కాంగ్రెస్ బూత్ కమిటీల ఏర్పాటును వేగవంతం చేయాలి.

*1815 పోలింగ్ బూత్‌లలో పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి.

*బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పదవుల నుంచి తొలగింపు తప్పదు.

నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి హెచ్చరిక.

ప్రతి పక్షం నల్లగొండ, అక్టోబర్ 13: నల్లగొండ జిల్లాలో యువజన కాంగ్రెస్ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా ఉన్న 1815 పోలింగ్ బూత్‌లలో పూర్తిస్థాయి బూత్ కమిటీల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 మండలాలు, 7 మునిసిపాలిటీలు, ఒక మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బూత్ కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో యువజన కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించి, మండల అధ్యక్షులకు బూత్ కమిటీల ఏర్పాటుపై స్పష్టమైన సూచనలు అందించాలని తెలిపారు. ప్రతి అసెంబ్లీ అధ్యక్షుడు తన నియోజకవర్గ పరిధిలో కమిటీల ఏర్పాటు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గత యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో ఎన్నికై పదవులు పొందినప్పటికీ సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొనకుండా, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని నాయకుల వివరాలను సేకరించి జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీకి నివేదిక అందజేయాలని అసెంబ్లీ అధ్యక్షులను ఆదేశించారు. ముఖ్యంగా మండల అధ్యక్షుల పనితీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని, బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న వారి వివరాలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

యువజన కాంగ్రెస్‌లో పదవులు కేవలం హోదా కోసం కాదని, పార్టీ సంస్థాగత బలోపేతానికి బాధ్యతతో పనిచేయడం కోసమని స్పష్టం చేశారు. పదవుల్లో కొనసాగుతూ సంస్థాగత కార్యక్రమాలకు దూరంగా ఉండే నాయకుల పనితీరును సమీక్షించి, అవసరమైతే వారిని పదవుల నుంచి తప్పించి, చురుకుగా పనిచేసే కొత్త నాయకులకు అవకాశం కల్పిస్తామని హెచ్చరించారు. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News