బొజ్జ యాదయ్యకు డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ గౌరవ పట్టా

సామాజిక సేవకు తగిన గుర్తింపు

ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుంచి ‘డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్’ పురస్కారం

గతంలో దళిత రత్న అవార్డు

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 16: సమాజ అభ్యున్నతే లక్ష్యంగా.. అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న సేవా ప్రస్థానానికి స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గణపురం గ్రామానికి చెందిన బొజ్జ యాదయ్యకు జర్మనీలోని ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. సామాజిక సేవా రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ‘డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్’ (హానరిస్ కాసా) గౌరవ పట్టాతో సత్కరించడం విశేషం. ఆదివారం రవీంద్ర భారతిలో దీపావళి పండుగ, జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న పలువురికి అవార్డులను ప్రదానం చేశారు. ఇదే కార్యక్రమంలో బొజ్జ యాదగిరికి డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ పట్టా అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, శ్రీ ప్రగతి ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, చైర్మన్‌ డాక్టర్‌ వి.ఆర్‌. శ్రీనివాసరాజులు పాల్గొని బొజ్జ యాదగిరి సన్మానించారు

సేవా ప్రతిభకు తగిన గుర్తింపు

సామాజిక సేవను బాధ్యతగా స్వీకరించి, దళిత బహుజనుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బొజ్జ యాదయ్యకు ఈ గౌరవం దక్కడం ఆయన సేవా ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. జర్మనీలోని స్టుట్‌గార్ట్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ తరఫున ఈ గౌరవ పట్టాను ప్రదానం చేసినట్లు ధ్రువపత్రంలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ మూల్యాంకన మండలి, అధ్యాపకుల సిఫార్సుల మేరకు ఈ గౌరవ డిగ్రీని అందించినట్లు సర్టిఫికెట్‌లో వివరించారు. ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబరుతో ఆయన పేరుపై ధ్రువ పత్రాన్ని జారీ చేశారు.

ప్రపంచ శాంతిపై ప్రత్యేక శిక్షణ.. సెమినార్‌లో పాల్గొని విజయవంతం

ప్రపంచ శాంతి స్థాపన అనే కీలక అంశంపై 2026 సెప్టెంబర్ 19న పుదుచ్చేరిలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం, సెమినార్‌లో బొజ్జ యాదయ్య పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. ఐపీయూ అచీవర్స్ ఫోరం, జర్మనీకి చెందిన గ్లోబల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రపంచ శాంతి, సామాజిక సామరస్యం, మానవతా విలువల పరిరక్షణ వంటి అంశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆయనకు మరో విశిష్ట గుర్తింపుగా నిలిచింది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ పేరుతో ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గణపురం గ్రామానికి చెందిన బొజ్జ యాదయ్య దళిత జన సమితినీ స్థాపించారు. వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. దళితులు బహుజనులు, అణగారిన వర్గాల హక్కులు, సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో సామాజిక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి వంటి అంశాలపై తన గళాన్ని వినిపిస్తున్నారు.

రాజకీయ రంగంలోనూ అడుగు.. గతంలో దళిత రత్న అవార్డు

సామాజిక సేవతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు యాదయ్య ప్రయత్నించారు. గత ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ రంగంలో తన ప్రస్థానాన్ని చాటుకున్నారు. గత ఏడాది ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా దళిత రత్న అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా గౌరవ డాక్టరేట్ లభించడం ఆయన సేవా ప్రయాణానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

గౌరవం పెంచిన బాధ్యత.. సేవకు మరింత ప్రోత్సాహం

ఒక వ్యక్తి చేసే సేవలకు లభించే గుర్తింపు మరింత మందిని సామాజిక బాధ్యత వైపు నడిపిస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే వారికి లభించే గౌరవాలు సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయి. బొజ్జ యాదయ్యకు లభించిన గౌరవ డాక్టరేట్ పట్ల గణపురం గ్రామస్తులు, అభిమానులు, పలువురు సామాజిక ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవం ఆయనలో మరింత సేవా స్ఫూర్తిని నింపి, భవిష్యత్తులో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరింత అంకితభావంతో పనిచేసేందుకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.

Related News

Latest News