హుస్నాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో దసరా కానుక

మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్‌లో స్విమ్మింగ్ పూల్, వాటర్ స్పోర్ట్స్ మౌలిక వసతుల నిర్వహణకు ప్రభుత్వ ఉత్తర్వులు

రెండు రోజుల క్రితం కబడ్డీ అకాడమీ.. నేడు స్విమ్మింగ్ పూల్‌కు సంబంధించి మరో కీలక నిర్ణయం

హుస్నాబాద్‌ను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, యువత

ప్రతిపక్షం, అక్టోబర్ 17, సిద్దిపేట: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో హుస్నాబాద్‌లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాధునిక స్విమ్మింగ్ పూల్‌తో పాటు స్టేడియం సమీపంలోని చెరువు వద్ద ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ G.O.Rt.No.1673, తేదీ: 17.10.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) పర్యవేక్షణలో ఈ క్రీడా కేంద్రాలను నిరంతరం అందుబాటులో ఉంచడంతో పాటు, క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ, భద్రతతో కూడిన సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, నిర్వహణ ఏర్పాట్లకు ప్రభుత్వం అనుమతించింది.

రెండు రోజుల క్రితమే హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ మంజూరు కాగా, తాజాగా స్విమ్మింగ్ పూల్, వాటర్ స్పోర్ట్స్ మౌలిక వసతుల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా క్రీడా వసతులు అందుబాటులోకి వస్తుండటంతో హుస్నాబాద్ ప్రాంతం క్రీడా కేంద్రంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ సదుపాయాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువత, క్రీడాకారులకు ఈతతో పాటు రోయింగ్, కనోయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందేందుకు మెరుగైన అవకాశాలు లభించనున్నాయి. స్థానికంగానే నాణ్యమైన క్రీడా వసతులు అందుబాటులోకి రావడం వల్ల యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు దోహదపడనుంది.

హుస్నాబాద్ నియోజకవర్గాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, యువత, క్రీడాభిమానులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Spread the love

Related News

Latest News