ఆపద వేళ అండగా ఇందిరమ్మ జీవిత బీమా

ప్రతి ఇంటికి ఇందిరమ్మ భీమా ధీమా

అర్హత కల్గిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా

ఐదు గ్రామాల్లో పథకం నమోదు ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 24: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా లభిస్తుందని చెప్పారు. కుటుంబ పెద్దకు ఏదైనా ఆపద ఎదురైతే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి ఇంటికి ధీమా, ప్రతి కుటుంబానికి కొండంత భరోసా అన్నారు.మంగళవారం నంగునూరు, రాంపూర్, బద్దిపడగ, సిద్ధన్నపేట, నాగరాజుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందులో భాగంగానే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించడం ద్వారా ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని బీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఫారాలను ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిచేసి, స్వయంగా సంతకం చేయడంతో పాటు నామినీ వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నామినీ ఎంపిక విషయంలో లబ్ధిదారుల నుంచి భౌతికంగా సంతకాలు తీసుకొని, మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, సిద్ధన్నపేట సర్పంచ్ సంగు పురేందర్, నాగరాజుపల్లి సర్పంచ్ ముక్కెర లింగం యాదవ్, రాంపూర్ సర్పంచ్ గోక మహిపాల్ రెడ్డి, బద్దిపడగ సర్పంచ్ మంద లక్ష్మి, మాజీ ఎంపీటీసీ ఎనగందుల నితిన్ కుమార్, చెలికాని యాదగిరి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాగుల కృష్ణ, ఎనగందుల యాదగిరి, బోడిగే శ్రీనివాస్, గుంటిపల్లి మాధురి, సాయిరాం, దేవులపల్లి రాజు, ఉపసర్పంచ్ చేర్యాల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల యాదగిరి, కాంగ్రెస్ నాయకులు కందికట్ల రాజు, బంగారు నర్సింలు, పంగ రాజశేఖరరెడ్డి, చిలుకల రాజు రెడ్డి, ఆదిమూలం మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News