[t4b-ticker]

ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలి

ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడమే ప్రజా పాలన లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 22: హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంచినీళ్ల బండ గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంచినీళ్ల బండ నుంచి యాటకర్లపల్లి వరకు రూ.2.05 కోట్లతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

విజయవంతమైన ఆయిల్‌పామ్ రైతుకు మంత్రి అభినందనలు

గ్రామానికి చెందిన రైతు చిన్నబోయిన అజయ్ ప్రభాకర్ విజయవంతంగా సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రైతు అనుభవాలను అడిగి తెలుసుకుని, ఆయిల్‌పామ్ సాగులో సాధిస్తున్న విజయానికి అభినందనలు తెలిపారు.ఆయిల్‌పామ్ సాగులో అన్ని ఖర్చులు పోను ఎకరాకు సుమారు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోందని రైతు మంత్రికి వివరించారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును మరింత విస్తరించేందుకు రైతులు ముందుకు రావాలని మంత్రి సూచించారు.

రైతులు, మహిళలు, ప్రజలకు మంత్రి సూచనలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయిల్‌పామ్ సాగును మరింత పెంచాలని మంత్రి సూచించారు. నీటి సంరక్షణ కోసం జలసిరి కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అర్హులైన వారు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, PM సూర్య ఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని మంత్రి సూచించారు.ప్రజా పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో రామ్మూర్తి, ఎమ్మార్వో మధుసూదన్, సర్పంచ్ నరేండ్ల కుమార్, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News