ప్రతిపక్షం, ఆగస్టు 22: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగభరితమైన సందేశాన్ని పంచుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పవన్.. సినీ హీరోగా ఎదగకముందే తన దృష్టిలో చిరంజీవి అసలైన హీరో అని పేర్కొన్నారు.
చిరంజీవి నర్సాపూర్‌లో చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు ఇంటికి వస్తే తమ ఇంట్లో పండగ వాతావరణం ఉండేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. సెలవులు ముగిసి ఆయన తిరిగి కాలేజీకి వెళ్లినప్పుడు ఇల్లంతా బోసిపోయినట్లుగా అనిపించేదని చెప్పారు. అన్నయ్య పక్కన నడుస్తున్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తితో కలిసి నడుస్తున్న భావన కలిగేదని, చిన్నప్పటి నుంచే ఆయనను ఎంతో అభిమానంతో ఆరాధించేవాడినని గుర్తు చేసుకున్నారు.
చిరంజీవికి పెళ్లయిన సమయంలో అన్నయ్య తమకు దూరమైపోతారేమోనని తాను ఒక గదిలో కూర్చొని ఏడ్చిన విషయాన్ని కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. తన బాధను గమనించిన చిరంజీవి, వదినను తన వద్దకు తీసుకొచ్చి ఆటపట్టించేవారని చెప్పారు. అనంతరం తనను మద్రాసుకు తీసుకెళ్లి ఎంతో ప్రేమగా చూసుకున్నారని తెలిపారు.
సినిమా రంగంలో ఎదగడానికి చిరంజీవి పడిన కష్టాలను దగ్గరుండి చూశానని పవన్ పేర్కొన్నారు. మద్రాసు వేడిలో గంటల తరబడి షూటింగుల్లో పాల్గొని, చెమటతో తడిసిన దుస్తులతో అర్థరాత్రి ఇంటికి చేరుకునే అన్నయ్యను చూసిన సందర్భాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు. ఆయన చేసిన త్యాగాలపై ఆధారపడి తాను జీవిస్తున్నాననే భావనతో ఎంతో గిల్టీగా ఫీలయ్యేవాడినని చెప్పారు.
తాను చదువులో విఫలమైనా, జీవితానికి సరైన దిశ కనిపించకపోయినా చిరంజీవి తనను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందరికీ ఆయన మెగాస్టార్ అయినప్పటికీ తనకు మాత్రం ఎప్పటికీ ఏకైక హీరో అని భావోద్వేగంతో పేర్కొన్నారు. తన ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ పంచుకున్న ఈ భావోద్వేగ సందేశానికి చిరంజీవి కూడా స్పందించారు. పవన్ మాటలు తమ జీవితంలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసి తనను భావోద్వేగానికి గురిచేశాయని తెలిపారు. తాను చేసిన ప్రేమ, త్యాగాలను పవన్ గుర్తుచేసుకోవడం ఆనందంగా ఉందని, అవన్నీ అన్నయ్యగా తన బాధ్యత, అనురాగంలో భాగమేనని చెప్పారు.
ప్రజల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న అంకితభావం, అచంచలమైన ధైర్యం, దేశం పట్ల ప్రేమను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. పవన్ తనను ‘హీరో’గా భావిస్తున్నప్పటికీ, పవన్ దృఢ సంకల్పం, నిజాయితీ, నిస్వార్థ ప్రయాణం తనను కూడా ఎన్నో విధాలుగా ప్రభావితం చేశాయని తెలిపారు. సోదరుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ సందేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




























