ప్రతి వార్డుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు..
ప్రత్యామ్నాయ నీటి సరఫరాపై సమీక్ష
చైర్పర్సన్ రాధిక భూపతిరాజు
ప్రతిపక్షం, నవంబర్ 12, మెదక్: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే మంచినీటి ఎద్దడిని అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు సూచించారు. ప్రజలకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లపై బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు, వివిధ రాజకీయ నాయకులు, మున్సిపల్లోని అన్ని విభాగాల సెక్షన్ హెడ్స్, సిబ్బంది, వార్డు అధికారులు పాల్గొన్నారు. నీటి కొరతను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చైర్పర్సన్ వివరించగా, కౌన్సిలర్లు, నాయకులు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో సంబంధిత వార్డు కౌన్సిలర్, వార్డు అధికారి, వాటర్‌మెన్, మెప్మా రిసోర్స్ పర్సన్‌తో పాటు మున్సిపల్ అధికారులు నియమించే సూపర్వైజర్లు సభ్యులుగా ఉంటారు.
కమిటీ ద్వారా చేపట్టనున్న ప్రధాన చర్యలు:
వార్డుల్లో నీటి పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టడం.
- ప్రతి ఇంటికి నీటి పొదుపుపై అవగాహన కల్పించడం.
- అవసరమైన ప్రాంతాల్లో పబ్లిక్ ట్యాప్‌లు ఏర్పాటు చేసి ఒక్కో ప్రాంతంలోని సుమారు 50 ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించడం.
- సొంత బోర్లు లేకుండా మిషన్ భగీరథ నీటి సరఫరాపై ఆధారపడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి నీరు అందించడం.
- మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ర్యాలమడుగు పంప్‌హౌస్ నుంచి రోజువారీ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవడం.
- హల్దీ వాగు పంప్‌హౌస్ వద్ద బోరు ఏర్పాటు చేసి, ఆ నీటిని ట్యాంకులోకి నింపి ప్రజలకు సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించడం.వేసవిలో మంచినీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు, వార్డు కమిటీలు సమన్వయంతో పనిచేయాలని చైర్పర్సన్ సూచించారు. నీటి వృథాను అరికడుతూ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కమిషనర్ నవీన్ మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు






























