ప్రతిపక్షం, ఆగస్టు 30: నేపాల్‌లో భారీ వరదల సమయంలో ఓ పాఠశాల ప్రిన్సిపల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏకంగా 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వెంటనే అప్రమత్తం చేయడంతో వందలాది మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడగలిగారు. ఆయన చూపిన చొరవకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తూ నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.
త్రిభువన్ త్రిశూలి పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడికి తన స్నేహితుడి ద్వారా భారీ వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం అందింది. పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చని భావించిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాఠశాలలో గంట మోగించి విద్యార్థులను అప్రమత్తం చేశారు. వెంటనే తరగతి గదులను ఖాళీ చేయించి, 1,643 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు.
విద్యార్థులందరినీ పాఠశాల సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు. పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించిన కొద్దిసేపటికే వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. భారీగా ప్రవహించిన వరద నీటికి పాఠశాల భవనం పూర్తిగా కొట్టుకుపోయింది. అయితే అప్పటికే ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడి అప్రమత్తతతో విద్యార్థులంతా పాఠశాల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.
అయితే వరద ముప్పు గురించి ముందుగా సమాచారం లేకపోవడంతో పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు, ఓ ఉద్యోగి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. విద్యార్థులను సకాలంలో తరలించకపోయి ఉంటే పరిస్థితి మరింత విషాదకరంగా మారేదని స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ క్షణాల్లో నిర్ణయం తీసుకున్న రాజేంద్ర దవాడి తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వేలాది మంది విద్యార్థుల భద్రత కోసం పనిచేసిన ఆయనను స్థానికులు ‘నిజమైన హీరో’గా కొనియాడుతున్నారు.
ఒక చిన్న సమాచారం అందుకున్న వెంటనే దానిని నిర్లక్ష్యం చేయకుండా, ప్రమాద తీవ్రతను అంచనా వేసి వేగంగా స్పందించడం వల్లే ఇంత పెద్ద ప్రాణనష్టం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. విపత్తుల సమయంలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ఎంతటి కీలకమో రాజేంద్ర దవాడి చర్య మరోసారి చాటిచెప్పింది.





























