నాడు క్షేమం.. నేడు సంక్షోభం

బీసీ హాస్టళ్లపై నిర్లక్ష్యపు నీడ!

సరుకులు లేవు… డైట్ బిల్లులు రావు… ట్యూటర్లకు జీతాల్లేవు

సిద్ధిపేట బీసీ హాస్టళ్ల సమస్యలపై హరీశ్ రావు సుదీర్ఘ సమీక్ష

ప్రతిపక్షం ప్రతినిధి , సిద్ధిపేట నవంబరు 1: బీఆర్ఎస్ అన్ని వసతులతో కళకళలాడిన బీసీ సంక్షేమ హాస్టళ్లు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సరుకుల కొరత, పెండింగ్ డైట్ బిల్లులు, నాసిరకం ఆహారం, ట్యూటర్లకు జీతాల బకాయిలు, అద్దెల చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలు విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ వసతి గృహాల సలహా సంఘం సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు, వార్డెన్లు, కమిటీ సభ్యులతో హాస్టళ్ల పరిస్థితిపై సుదీర్ఘంగా సమీక్షించారు. గతంలో జిల్లా, పాఠశాల స్థాయిలో సరుకుల సరఫరా వ్యవస్థ సమర్థంగా పనిచేసేదని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రీకృత విధానంతో నాణ్యత దెబ్బతింటోందని ఆరోపించారు. ఆయిల్, కారం, బిస్కెట్లు మినహా పలు సరుకులు విడిగా వస్తున్నాయని తెలిపారు. కొన్ని వస్తువులపై ఎక్స్‌పైరీ తేదీలు, నాణ్యత గుర్తులు కూడా కనిపించడం లేదని అన్నారు. స్థానిక మార్కెట్ కంటే ఎక్కువ ధరలు చెల్లిస్తున్నా నాసిరకం సరుకులు అందుతున్నాయని విమర్శించారు.

ఉడకని పప్పు… చిన్న గుడ్లు

గతంలో నాణ్యమైన కందిపప్పు ఇచ్చేవారని చెప్పారు. ప్రస్తుతం బి-గ్రేడ్ పప్పు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అది సరిగా ఉడకక గ్యాస్ ఖర్చు పెరుగుతోందని తెలిపారు.విద్యార్థులకు కేవలం 40 గ్రాముల చిన్న సైజు కోడిగుడ్లు అందుతున్నాయని అన్నారు. తక్కువ ధరకు మాసం సరఫరాకు టెండర్లు పిలవడంతో నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

నవంబర్ వచ్చినా సరుకుల జాడేది

నవంబర్ నెల ప్రారంభమైనా పలు హాస్టళ్లకు సరుకులు చేరలేదని హరీశ్ రావు అన్నారు. ఇండెంట్లు పెట్టినా స్పందన లేదని తెలిపారు.కాంట్రాక్టర్ ఎవరు? సబ్‌కాంట్రాక్టర్ ఎవరు? అనే వివరాలు కూడా వార్డెన్లకు తెలియడం లేదని పేర్కొన్నారు. సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

అప్పుల్లో వార్డెన్లు

ప్రీ-మెట్రిక్ హాస్టళ్లకు ఆగస్టు నుంచి డైట్ ఛార్జీలు రావడం లేదని తెలిపారు. పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లకు సెప్టెంబర్ నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గ్యాస్, పాలు, పెరుగు, పండ్లు కొనుగోలు చేయాల్సి ఉండటంతో వార్డెన్లు కిరాణా దుకాణాల్లో అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో హాస్టల్‌పై లక్షల రూపాయల బకాయిలు పేరుకు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పెరగని మెస్ ఛార్జీలు

నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా డైట్ ఛార్జీలు పెరగలేదని హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం ఉన్న మొత్తంతో నాణ్యమైన కామన్ మెనూ అమలు చేయడం కష్టమవుతోందని తెలిపారు. విద్యార్థుల పోషకాహార అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.

సైజు సరిపోని యూనిఫారాలు

విద్యా సంవత్సరం సగం గడిచినా పూర్తి స్థాయిలో డ్రెస్సులు అందలేదని తెలిపారు. కొన్ని చోట్ల ఒక్క జత, మరికొన్ని చోట్ల రెండు జతలే అందాయని చెప్పారు. కుట్టించిన బట్టలు సరిగా లేకపోవడం, సైజులు సరిపోకపోవడంతో విద్యార్థులు తమ కాస్మొటిక్ డబ్బులతో బయట టైలర్ల వద్ద యూనిఫారాలు కుట్టించుకుంటున్నారన్నారు. పేద విద్యార్థులపై అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమలుకాని నైట్ డ్రెస్సుల హామీ

నైట్ డ్రెస్సుల హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. బ్లాక్ షూస్ కూడా పూర్తిస్థాయిలో అందలేదని తెలిపారు. వచ్చిన చోట సరైన సైజులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

సిద్ధిపేటపై వివక్ష ఎందుకు?

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ఇతర జిల్లాల్లో హాస్టళ్ల నిర్వహణకు అధిక నిధులు ఇస్తుండగా, సిద్ధిపేటకు తక్కువ మొత్తాలు కేటాయించడం సరికాదని అన్నారు. జిల్లా అవసరాలను పరిగణనలోకి తీసుకొని సమానంగా నిధులు విడుదల చేయాలని కోరారు.
అద్దెలకు 14 నెలల నిరీక్షణ హాస్టల్ భవనాల అద్దెలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొన్ని హాస్టళ్లకు 14 నెలలుగా అద్దెలు చెల్లించలేదని పేర్కొన్నారు.సిద్ధిపేట బాలికల కళాశాల హాస్టల్ భవనానికి సుమారు రూ.10 లక్షల అద్దె బకాయి ఉందని చెప్పారు. వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యూటర్లకు జీతాల్లేవు.. పదో తరగతి విద్యార్థులకు నష్టం

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించే హాస్టల్ ట్యూటర్లకు నెలల తరబడి జీతాలు అందడం లేదని హరీశ్ రావు అన్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేసి, విద్యార్థుల ప్రత్యేక బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

రీయింబర్స్‌మెంట్ నిధుల్లో భారీ కోత

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్టల్ విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ కోసం జిల్లాకు రూ.15 కోట్ల వరకు నిధులు విడుదల అయ్యాయని హరీశ్ రావు తెలిపారు. గత ఏడాది ఆ మొత్తం రూ.9.55 కోట్లకు తగ్గిందని, ఈ ఏడాది కేవలం రూ.4 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయని పేర్కొన్నారు. డే-స్కాలర్ విద్యార్థులకు సంబంధించిన ఎంటీఎఫ్ నిధులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.

ఖాళీ సీట్లు భర్తీ చేయాలి

బీసీ గర్ల్స్ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే భర్తీ చేయాలని హరీశ్ రావు కోరారు. పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడం ద్వారా వారికి విద్యతో పాటు వసతి, పౌష్టికాహారం అందుతాయని చెప్పారు.డ్రైనేజీ, బాత్రూమ్‌లు, విద్యుత్ సమస్యలు, కూలిపోయిన ప్రహరీ గోడలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను వార్డెన్లు సమావేశంలో ప్రస్తావించారు. మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని హరీశ్ రావు సూచించారు. నిధుల మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, విద్యార్థుల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, హాస్టల్ వార్డెన్లు, అడ్వైజరీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News