[t4b-ticker]

ప్రాణం పోశాడు.. పేరు పెట్టాడు❤️.. పసిబిడ్డకు పునర్జన్మ ఇచ్చిన కమిషనర్

ప్రతిపక్షం, ఆగస్టు 17: ఖమ్మం నగరంలో ఓ అధికారి మానవత్వంతో చేసిన సాయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. మృత్యువుతో పోరాడుతున్న ఓ పసిబిడ్డకు అండగా నిలిచిన ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య.. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడటంతో పాటు స్వయంగా పేరు పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న పసిబిడ్డకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. అయితే ఆపరేషన్‌కు అవసరమైన భారీ మొత్తాన్ని సమకూర్చే స్థోమత కుటుంబానికి లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు.

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సుమారు రూ.14 లక్షల నిధులను సమకూర్చి చిన్నారికి అవసరమైన చికిత్స, శస్త్రచికిత్స చేయించారు. వైద్యుల కృషితో ఆపరేషన్‌ విజయవంతం కావడంతో పసిబిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

చిన్నారి ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం తల్లిదండ్రులు కమిషనర్‌ను కలసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అభిషేక్‌ అగస్త్యను కలిసిన తల్లిదండ్రులు.. తమ పాపకు ఆయన చేతుల మీదుగా పేరు పెట్టాలని కోరారు.

వారి కోరికను సంతోషంగా అంగీకరించిన కమిషనర్‌.. ఆ చిన్నారికి ఎంతో ప్రేమతో ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేశారు. పాపకు ప్రాణం కాపాడటమే కాకుండా స్వయంగా పేరు పెట్టడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన అక్కడున్న వారిని సైతం కదిలించింది.

ఓ అధికారి తన విధి బాధ్యతలకు మించి స్పందించి పేద కుటుంబానికి అండగా నిలిచి చిన్నారి ప్రాణాలను కాపాడటంపై స్థానికులు అభిషేక్‌ అగస్త్యను అభినందిస్తున్నారు. చిన్నారి కుటుంబంలో వెలుగులు నింపిన ఈ ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.

Spread the love

Related News

Latest News