ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: తెలంగాణలో శుభకార్యాల సందర్భంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొందరు హిజ్రాలు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యను అరికట్టేందుకు మరోసారి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసు కమిషనర్లకు సూచిస్తానని వెల్లడించారు.
గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనూ ఇలాంటి ఫిర్యాదులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు డీజీపీ గుర్తుచేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలను నియంత్రించేందుకు అప్పట్లో చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం మళ్లీ ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టేలా కమిషనర్లకు సూచనలు చేస్తానని పేర్కొన్నారు.
అయితే ట్రాన్స్‌జెండర్లందరినీ ఒకే విధంగా చూడకూడదని డీజీపీ సూచించినట్లు తెలుస్తోంది. సమాజంలో వివిధ రంగాల్లో ట్రాన్స్‌జెండర్లు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, ట్రాఫిక్ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లు అసిస్టెంట్లుగా పనిచేసిన సమయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని సీవీ ఆనంద్ తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీ స్పష్టం చేశారు. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన ఉపాధి, సమాజంలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇటీవల శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల వద్ద డబ్బులు ఇవ్వాలంటూ బలవంతం చేస్తున్నారంటూ కొందరు వ్యక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీపీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సమస్యను నియంత్రించేందుకు పోలీసులు మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.





























