ప్రతిపక్షం, గుండాల, సెప్టెంబర్ 27: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడంలో విఫలమైందనే కారణంతోనే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటనపై విమర్శలకు దిగుతోందని గుండాల మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు తెల్లం భాస్కర్, పార్టీ నాయకుడు గడ్డం వీరన్న ఆరోపించారు.మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.రేగా కాంతారావు పర్యటిస్తేనే కాంగ్రెస్ నాయకులకు వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా గుండాల మండలానికి చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. గుండాల మండలంలో రేగా కాంతారావు హయాంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.అభివృద్ధి అంటే గత ప్రభుత్వంలో మంజూరైన పనులకు రిబ్బన్ కటింగ్లు చేయడం కాదని, కొత్తగా నిధులు తెచ్చి పనులను పూర్తి చేయడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. రైతులకు సరిపడా విద్యుత్, సాగునీటి సౌకర్యాలు, రుణమాఫీ, రైతుబంధు వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. మహిళలకు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు.
గుండాల మండలంలోని రహదారులు, వాగులపై వంతెనలు మంజూరు చేయించి వాటిని పూర్తి చేయించిన ఘనత రేగా కాంతారావుకే దక్కుతుందని పేర్కొన్నారు. విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు తమ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు.ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు గుండాల మండల అభివృద్ధిపై దృష్టి సారించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ప్రతిపక్ష నాయకుల పర్యటనలను విమర్శించడం మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని రాజకీయంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి టి.రాము, నిట్ట రాములు, తాటి కృష్ణ, జాడి ప్రభాకర్, కుంజ సుధాకర్, బొమ్మెర్ల శ్రీను, జిమ్మిడి సాంబయ్య, గొల్లపల్లి రమేష్, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర్ల రవి, గూగులోతు ఈరు, వాగబోయిన బాటయ్య, ఈసం సుధాకర్, ధనసరి భాస్కర్, గంగాధరి ప్రమోద్, మొక్క ప్రశాంత్, సల్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.





























