యువత పొగాకు వ్యసనానికి దూరంగా ఉండాలి
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 31: యువకులు దేశ భవిష్యత్తుకు పునాదిరాళ్ళని గట్ల మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం. శివకుమార్ అన్నారు. యువతను పొగాకు ఉత్పత్తుల వినియోగం, వ్యసనాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా చేపట్టిన ‘పొగాకు రహిత యువజన ప్రచారం–4.0’ కార్యక్రమంలో భాగంగా నంగునూరులో విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గట్లమల్యాల వైద్యాధికారి డాక్టర్ ఎం. శివకుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నంగునూరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నంగునూరులో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే తీవ్రమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ, యువత పొగాకు, గుట్కా, సిగరెట్లు వంటి హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా వ్యక్తి జీవితాన్ని దెబ్బతీస్తుందని వివరించారు. చిన్న వయస్సులో స్నేహితుల ప్రభావం, ఆసక్తి లేదా సరదా కోసం పొగాకు ఉత్పత్తులను వినియోగించడం ప్రారంభిస్తే, క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. పొగాకు వినియోగం వల్ల నోటి సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు.
ఆరోగ్యవంతమైన యువత ఆరోగ్యవంతమైన సమాజానికి, అభివృద్ధి చెందిన దేశానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటంతో పాటు, తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుళ ప్రయోజన ఆరోగ్య విస్తరణ అధికారి కనకయ్య, సహాయక నర్సు సామ్రాజ్యం, ఆశా కార్యకర్త రజిత, ఉన్నత పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు దుబ్బుడు రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులు కన్యాలాల్, వంశీ కృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శివకోటి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాపొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటామని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.






























