ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు

జాతీయ రహదారిపై బద్దిపడగలో సెంటర్ లైట్లు ఏర్పాటు చేయాలి

నష్టపరిహారం ఇచ్చినా ప్రారంభం కాని రంగనాయక సాగర్ కాలువల పనులు

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబర్ 26: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన నంగునూరు మండల ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు సంబంధించి ఏడు ఫిర్యాదులు అందాయి. బద్దిపడగ గ్రామం మీదుగా వెళ్లే జాతీయ రహదారి 765డీజీపై సెంటర్ లైట్లు ఏర్పాటు చేయాలని, రంగనాయక సాగర్ కాలువల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బాధితులు అధికారులను కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు దారులు విజ్ఞప్తి చేశారు.

జాతీయ రహదారిపై లైట్లు ఏర్పాటు చేయాలి

బద్దిపడగ గ్రామంలోని జాతీయ రహదారి 765డీజీపై సెంటర్ లైట్లు ఏర్పాటు చేయాలని ఊరతాండకు చెందిన సాయి నాయక్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రహదారిపై తగిన లైటింగ్ సదుపాయం లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై సెంటర్ లైట్లు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నష్టపరిహారం ఇచ్చినా ప్రారంభం కాని కాలువ పనులు

రంగనాయక సాగర్ కాలువల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని ఊరతాండకు చెందిన గుగులోతు మహేశ్ అధికారులను కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాలువల నిర్మాణం కోసం భూములు సేకరించి రైతులకు నష్టపరిహారం అందించినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించక పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడంతో సాగునీటి సదుపాయంపై ఆధారపడిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న కాలువల నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శాఖల వారీగా ఫిర్యాదుల వివరాలు

నంగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం ఏడు ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. శాఖల వారీగా ఆర్‌అండ్‌బీ శాఖకు ఒకటి, ఎంపీడీవో కార్యాలయానికి మూడు, హౌసింగ్ శాఖకు ఒకటి, తహసీల్దార్ కార్యాలయానికి ఒకటి, విద్యుత్ శాఖకు ఒక ఫిర్యాదు అందినట్లు వివరించారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని, అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News