డిండి రద్దు చేస్తే ఉద్యమమే : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
*డిండి లేకుంటే మునుగోడుకు నీళ్లే లేవు !
*డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం .
*కిష్టరామ్ పల్లి, చర్లగూడెం ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే డిండి తప్పనిసరి .
*చెరువులు పూడికతీసి నింపితేనే రైతులకు మేలు – మిషన్ కాకతీయను గుర్తుచేసిన మాజీ ఎమ్మెల్యే.
*మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
ప్రతి పక్షం – నాంపల్లి, అక్టోబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, మునుగోడు ప్రజలు చూస్తూ ఊరుకోరని, దానిని కొనసాగించడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.బుధవారం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం చెరువు, నాంపల్లి మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు రద్దు చేయాలని చూస్తుందని, ఈ ప్రాజెక్టు రద్దు అయితే మునుగోడులో నిర్మిస్తున్న కిష్టరామ్ పల్లి, చర్లగూడెం ప్రాజెక్టులకు నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు లేక కేవలం బోర్ల నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను చూసి అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రద్దు ఆలోచనను మానుకోవాలన్నారు.
*చర్లగూడెం, కృష్ణరాయన్ పల్లి ప్రాజెక్టులు పూర్తి చేయాలి:
అదేవిధంగా చర్లగూడెం, కృష్ణరాయన్ పల్లి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శేషలేటి వాగు నుండి గొలుసు కాలువల ద్వారా చెరువులోకి నీళ్లను నింపితే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.గత కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులలో పూడిక తీయడంతో చెరువులు నీళ్లతో నిండి కళకళలాడుతూ ఉండేవన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులలో నీరు నిల్వ లేకపోవడం బాధాకరమన్నారు.
*ఎమ్మెల్యేపై విమర్శలు:
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సోషల్ మీడియాపై ఉన్న శ్రద్ధ మునుగోడు అభివృద్ధిపై లేదన్నారు. ఆయనకు ఎప్పుడు మంత్రి పదవి, కాంట్రాక్టుల బిల్లుల కోసమే ఆరాటం తప్ప, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం ఆయన చేసిన పని శూన్యం అన్నారు. ఇప్పటికైనా ప్రచారంపై శ్రద్ధ మానుకుని మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.అనంతరం మండల కేంద్రంలోని నాంపల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు.
*ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు… కూసుకుంట్ల ఆగ్రహం:
నాంపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆస్పత్రిని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో వైద్యులు ఎవరూ లేకపోవడంతో కేవలం నర్సు మాత్రమే రోగులకు వైద్యం చేస్తుండడంతో డీఎంహెచ్ఓతో ఫోన్ లో మాట్లాడి వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది డ్యూటీకి రాకపోయినా రిజిస్టర్ లో వచ్చినట్టుగా సంతకాలు పెట్టి పోతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ ని వేరే దగ్గరికి డిప్యూటేషన్ పై పంపించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మాడపు నరసింహారావు, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పోగుల వెంకట్ రెడ్డి, సర్పంచులు నక్క చంద్రశేఖర్, కడారి శ్రీశైలం యాదవ్, పల్లె వెంకన్న, సాగర్ల యాదయ్య, దామెర సహదేవ్, పూదరి సైదులు, సభావత్ సర్దార్ నాయక్, కుంభం చరణ్ రెడ్డి పాల్గొన్నారు.




























